భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని పరుగుల్లో పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్ అధిగమించగలడని ఆ దేశ మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమీజ్ రాజా జోస్యం చెప్పాడు. 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన బాబర్ అజామ్.. గత రెండేళ్లుగా మూడు ఫార్మాట్లలోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానంలో కొనసాగుతున్న బాబర్ అజామ్‌కి ఇటీవల పాక్ టీ20 టీమ్ పగ్గాలని కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అప్పగించింది. దీంతో.. రాబోవు రోజుల్లో అతను వన్డే, టెస్టు టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా అందుకునే సూచనలు ఉన్నాయని వార్తలు వస్తుండగా.. గెలుపోటముల గురించి చింతించకుండా అతను ముందుకు వెళ్లగలిగితే అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీని అధిగమించేస్తాడని రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ తరహాలోనే కవర్ డ్రైవ్ ఆడే బాబర్ అజామ్‌ని గత కొంతకాలంగా పాకిస్థాన్ విరాట్ కోహ్లీగా ఆ దేశ అభిమానులు అభివర్ణిస్తున్న విషయం తెలిసిందే.
విరాట్ కోహ్లీ తరహాలోనే ఫార్మాట్‌కి అనుగుణంగా మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్న బాబర్ అజామ్.. చాపకింద నీరులా ఇన్నింగ్స్‌ని నిర్మించడంలో దిట్ట. ముఖ్యంగా.. ఫీల్డర్ల మధ్యలో నుంచి బంతుల్ని బౌండరీకి తరలించడం, మ్యాచ్ గమనానికి అనుగుణంగా గేర్లు మార్చడంలో అతను విరాట్ కోహ్లీని తలపిస్తున్నాడు. దీంతో.. అతను ఎప్పటికైనా దిగ్గజ క్రికెటర్‌గా ఎదుగుతాడని ఆ దేశ అభిమానులు ఆశిస్తున్నారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే..? బాబర్ అజామ్‌కి విరాట్ కోహ్లీ ఆరాధ్య క్రికెటర్. అతనిలా ఎదగాలని తాను కలలు కంటున్నట్లు ఇప్పటికే చాలాసార్లు బహిరంగంగానే బాబర్ చెప్పుకొచ్చాడు. మాటలే కాదు.. మైదానంలోనూ కోహ్లీ తరహాలో సవాళ్లని స్వీకరించడం వాటిని ఛేదించడంతో బాబర్ అజామ్ తిరుగులేని క్రికెటర్‌గా ఎదిగిపోయాడు.
2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 86 టెస్టులాడి 53.63 సగటుతో 7,240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలానే 248 వన్డేలాడిన కోహ్లీ 59.34 సగటుతో ఏకంగా 11,867 పరుగులు చేయగా.. ఇందులో 43 శతకాలు, 58 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక టీ20ల్లోనూ 50.8 సగటుని కొనసాగిస్తున్న కోహ్లీ ఆడిన 81 టీ20 మ్యాచ్‌ల్లో 2,794 పరుగులు చేశాడు. మొత్తంగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 21,901 పరుగులు చేశాడు. ఫిట్‌నెస్, ఫామ్ పరంగా మెరుగ్గా ఉన్న 31 ఏళ్ల కోహ్లీ.. కనీసం మరో నాలుగేళ్ల పాటు క్రికెట్ ఆడే అవకాశాలు మొండుగా ఉన్నాయి.
Be the first to comment on "కోహ్లీని ఆ పాకిస్థాన్ క్రికెటర్ బీట్ చేయగలడా..?"