భారత్ చేతిలో వెస్ట్ ఇండీస్ ఓటమి

భారత్ లో జరిగిన ఒడిఐ మ్యాచ్ల్లో  టీమిండియా ఇంకోసారి ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. వెస్టిండీస్‌ని ఈ మధ్య టీ20 సిరీస్‌లో 2-1 తేడాతో ఓడించేసిన భారత్ జట్టు.. వన్డే సిరీస్‌లోనూ అదే తరహాలో కరీబియన్లని చిత్తు చేసి 2-1తో సిరీస్‌ని చేజిక్కించుకుంది. కటక్ వేదికగా ఆదివారం జరిగిన విజేత నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో 316 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (85: 81 బంతుల్లో 9×4), ఓపెనర్లు కేఎల్ రాహుల్ (77: 89 బంతుల్లో 8×4, 1×6), రోహిత్ శర్మ (63: 63 బంతుల్లో 8×4, 1×6) నిలకడగా ఆడటంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. భారత్ గడ్డపై గత 13 ఏళ్లలో ఒక్కసారి కూడా వన్డే సిరీస్‌లో విండీస్ గెలవకపోగా.. టీమిండియా వరుసగా ఆ జట్టుపై పదో ద్వైపాకిక సిరీస్ విజయాన్ని అందుకోవడం విశేషం.

316 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్.. భారత్‌కి మెరుపు ఆరంభాన్నిచ్చారు. గత బుధవారం వైజాగ్ వన్డేలో సెంచరీలు బాదిన ఈ జోడీ.. కటక్‌లోనూ హాఫ్ సెంచరీలు నమోదు చేసుకుని మొదటి వికెట్‌కి 21.2 ఓవర్లలో 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక ఎండ్‌లో క్రీజులో పాతుకుపోయి నిలకడగా ఆడుతున్నా.. శ్రేయాస్ అయ్యర్ (7), రిషబ్ పంత్ (7), కేదార్ జాదవ్ (9) సాహసాలకి వెళ్లి వికెట్ చేజార్చుకున్నారు. అయినప్పటికీ.. ఓపికగా ఆడిన విరాట్ కోహ్లీ.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన రవీంద్ర జడేజా (39 బ్యాటింగ్: 31 బంతుల్లో 4×4)తో కలిసి టీమ్‌ని విజయతీరాలకి చేర్చాడు. కానీ.. జట్టు స్కోరు 286 వద్ద కీమో పాల్ బౌలింగ్‌లో కోహ్లీ ఆరో వికెట్ రూపంలో ఔటవడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. భారత్ విజయానికి 29 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన దశలో కోహ్లీ ఔటవడంతో క్రీజులోకి వచ్చిన శార్ధూల్ ఠాకూర్ (17 నాటౌట్: 6 బంతుల్లో 2×4, 1×6) హిట్టింగ్‌తో అదరగొట్టాడు. అతనికి తోడుగా రవీంద్ర జడేజా కూడా బ్యాట్ ఝళిపించడంతో భారత్ 48.4 ఓవర్లలోనే 316/6తో అలవోకగా విజయాన్ని అందుకోగలిగింది. ఠాకూర్ హిట్టింగ్ చేయగానే ఒత్తిడికి గురైన వెస్టిండీస్ ఫీల్డింగ్‌లోనూ తప్పిదాలు చేయడం టీమిండియాకి కలిసొచ్చింది. దీంతో.. రనౌట్ నిర్ణయం వెలువడక ముందే టీమిండియా గెలిచేసింది.

Be the first to comment on "భారత్ చేతిలో వెస్ట్ ఇండీస్ ఓటమి"

Leave a comment

Your email address will not be published.


*