8 వికెట్ల తేడాతో భారత్ చేతిలో బంగ్లాదేశ్ ఓటమి…

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భారత్ జట్టు మొదటి అట ఓటమికి బదులు తీర్చుకుంది. గత ఆదివారం ఢిల్లీ వేదికగా జరిగిన మొదటి టీ20లో అనూహ్యంగా ఓడిపోయిన భారత్ జట్టు. రెండో టీ20 లో విజయంతో సిరీర్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. గురువారం రాత్రి రాజ్‌కోట్‌లో జరిగిన రెండో టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ (85: 43 బంతుల్లో 6×4, 6×6) బారి ఇన్నింగ్స్ ఆడటంతో 8 వికెట్ల తేడాతో అలవోకగా విజయాన్ని అందుకుంది. దీంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమవగా.. సిరీస్ విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ20 మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకి జరగబోతుంది.  మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్లు మహ్మద్ నయిమ్ (36: 31 బంతుల్లో 5×4), లిట్టన్ దాస్ (29: 21 బంతుల్లో 4×4), కెప్టెన్ మహ్మదుల్లా (30: 21 బంతుల్లో 4×4) చెప్పుకో దగ్గ స్కోరు చేశారు. భారత బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్, ఖలీల్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు.

154 పరుగుల లక్ష్య ఛేదనని ఓపెనర్ శిఖర్ ధావన్ (31: 27 బంతుల్లో 4×4)తో కలిసి ఆరంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలి టీ20లో మొదటి ఓవర్‌లోనే 9 పరుగుల వద్ద ఔటైన రోహిత్ శర్మ.. రెండో టీ20లో మాత్రం బంగ్లాదేశ్ బౌలర్లని ఉతికారేశాడు. పవర్ ప్లే నుంచే స్పిన్నర్లు, పేసర్లు అని తేడా లేకుండా రోహిత్ శర్మ భారీ షాట్లు ఆడటంతో మైదానంలోని బంగ్లాదేశ్ ఫీల్డర్లు ప్రేక్షకపాత్ర వహించాల్సి వచ్చింది. ముఖ్యంగా.. స్పిన్నర్ హుస్సేన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ వరుసగా 6, 6, 6 బాదేశాడు. రోహిత్ జోరు చూస్తే టీ20 సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ.. జట్టు స్కోరు 125 వద్ద సిక్స్ కొట్టే ప్రయత్నంలో రోహిత్ ఔటవగా.. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (24 నాటౌట్: 13 బంతుల్లో 3×4, 1×6), కేఎల్ రాహుల్ (8 నాటౌట్: 11 బంతుల్లో) గెలుపు లాంఛనాన్ని 15.4 ఓవర్లలోనే 154/2తో పూర్తి చేశారు. బంగ్లా బౌలర్లలో అమినుల్ మాత్రమే రెండు వికెట్లతో ఫర్వాలేదనిపించాడు.  

Be the first to comment on "8 వికెట్ల తేడాతో భారత్ చేతిలో బంగ్లాదేశ్ ఓటమి…"

Leave a comment

Your email address will not be published.


*