ఆస్ట్రేలియా తో పోయిన ఆదివారం జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో వర్షం వల్ల ఓటమి నుంచి తప్పించుకున్న పాకిస్థాన్‌ని రెండో టీ20 లో మాత్రం ఎవరూ రక్షించలేకపోయారు. కాన్‌బెర్రా వేదిక గా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చెసింది. లక్ష్యాన్ని స్టీవ్‌స్మిత్ (80 నాటౌట్: 51 బంతుల్లో 11×4, 1×6) హాఫ్ సెంచరీ కొట్టడంతో మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా 151/3 తో ఛేదించేసింది. ఇక సిరీస్‌లో ఆఖరి టీ20 మ్యాచ్ శుక్రవారం జరగబోతోంది. మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే.
మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టులో కెప్టెన్/ ఓపెనర్ బాబర్ అజామ్ (50: 38 బంతుల్లో 6×4) మెరుగైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఆరంభంలోనే ఓపెనర్ పకార్ జమాన్ (2), హరీస్ సోహైల్ (6), మహ్మద్ రిజ్వాన్ (14), ఆసిఫ్ అలీ (4) వరుసగా ఔటైనా.. ఇఫ్తికర్ అహ్మద్ (62 నాటౌట్: 34 బంతుల్లో 5×4, 3×6)తో కలిసి నిలకడగా ఆడిన బాబర్ అజామ్.. పాకిస్థాన్‌ని మెరుగైన స్థితిలో నిలిపే ప్రయత్నం చేశాడు. కానీ.. ఇఫ్తికర్ తో సమన్వయ లోపం కారణంగా అతను రనౌటైపోయాడు. జట్టు స్కోరు 106 వద్ద అగర్ బౌలింగ్‌లో బంతిని మిడ్‌వికెట్ దిశగా తరలించిన బాబర్ అజామ్ సింగిల్ పూర్తి చేసి రెండో పరుగు కూడా తీసే ప్రయత్నం చేశాడు. కానీ.. బంతిని అందుకున్న ఫీల్డర్ డేవిడ్ వార్నర్ ఎవరూ ఊహించని రీతిలో డైరెక్ట్‌గా బంతిని వికెట్లపైకి విసరడంతో బాబర్ అజామ్ రనౌటయ్యాడు.
వాస్తవానికి డీప్ మిడ్‌వికెట్‌లో వార్నర్ ఫీల్డింగ్ చేస్తుండటంతో అక్కడ రెండో పరుగుకి అవకాశం లేదు. కానీ.. ఇఫ్తికర్ రెండో పరుగు కోసం అప్పటికే క్రీజు వదిలి కొంచెం దూరం వచ్చేయడం తో తప్పనిసరి పరిస్థితుల్లో బాబర్ అజామ్ కూడా రెండో పరుగుకి వెళ్లాల్సి వచ్చింది. దీంతో.. రనౌట్ తర్వాత ఇఫ్తికర్ పై అసహనం వ్యక్తం చేస్తూ బాబర్ అజామ్ చేతులతో తన తలని బాదుకోవడం కనిపించింది. ఇటీవల శ్రీలంకతో సిరీస్ ఓటమి తర్వాత సర్ఫరాజ్ అహ్మద్‌ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన పాకిస్థాన్.. బాబర్ అజామ్‌కి టీ20 పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే.
Be the first to comment on "7 వికెట్ల తేడా తో పాకిస్తాన్ ను ఓడించిన అస్ట్రేలియా జట్టు"