మొదటి టీ20లో బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓటమి

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌ కి భారత్ కి మధ్య జరిగిన ఆదివారం జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు ఊహించని విధంగా ఓడిపోయింది. ముష్ఫికర్ రహీమ్ (60 నాటౌట్: 43 బంతుల్లో 8×4, 1×6) అజేయ హాఫ్ సెంచరీ కొట్టడంతో భారత్ నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. టీ20 చరిత్రలో భారత జట్టుపై  బంగ్లాదేశ్ గెలవడం ఇదే మొదటిసారి. ఈ  గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో ఉంది.  రెండవ టీ20 మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా గురువారం రాత్రి 7 గంటలకి జరుగుతుంది.

బంగ్లాదేశ్ మ్యాచ్ గెలవడానికి చివరి 12 బంతుల్లో 22 పరుగులు చేయాల్సివచ్చింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ముష్ఫికర్ వరుసగా నాలుగు ఫోరులు కొట్టేసాడు. అంతక ముందు ఓవర్‌లోనే చేతిలో పడిన ముష్ఫికర్ క్యాచ్‌ని కృనాల్‌ పాండ్య జారవిడిచాడు. మ్యాచ్ మధ్య ఓవర్లలోనూ ముష్ఫికర్ ఎల్బీడబ్ల్యూగా ఔటవగా.. రిషబ్ పంత్‌ నుంచి సపోర్ట్ లభించకపోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ డీఆర్‌ఎస్ కోరలేదు. దీంతో రెండు జీవనదానాలు పొందిన ముష్ఫికర్ ఆఖరి వరకూ క్రీజులో నిలిచి బంగ్లాదేశ్‌ని 19.3 ఓవర్లలో 154/3తో గెలిపించాడు.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ టీం కెప్టెన్ మహ్మదుల్లా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఓపెనర్ శిఖర్ ధావన్ (41: 42 బంతుల్లో 3×4, 1×6)తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ (9: 5 బంతుల్లో 2×4) మొదటి ఓవర్‌లోనే రెండు ఫోర్లు కొట్టి ఔటైపోయాడు. ఆ తర్వాత  కేఎల్ రాహుల్ (15: 17 బంతుల్లో 2×4) బంతి గమనాన్ని అంచనా వేయడంలో విఫలమై వికెట్ చేజార్చుకోగా. శ్రేయాస్ అయ్యర్ (22: 13 బంతుల్లో 1×3, 2×6)సిక్స్ కొట్టే ప్రయత్నంలో ఔటైపోయాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ (27: 26 బంతుల్లో 3×4) 19వ ఓవర్ వరకూ క్రీజులో నిలిచినా.. ఆశించిన మేర పరుగులు చెయ్యలేకపోయాడు. కానీ.. చివరి రెండు ఓవర్లలో కృనాల్‌ పాండ్య  (15 నాటౌట్: 8 బంతుల్లో 1×4, 1×6), వాషింగ్టన్ సుందర్ (14 నాటౌట్: 5 బంతుల్లో 2×6) భారీ షాట్లు ఆడటంతో భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగలిగింది.

Be the first to comment on "మొదటి టీ20లో బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓటమి"

Leave a comment

Your email address will not be published.


*