విరాట్ కోహ్లీ GOAT ఆ? అని ట్విట్టర్ వినియోగదారులను అడిగిన ఐసీసీ

ప్రతీ ఏడాది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంటే ఐసీసీ మూడు ముఖ్యమైన మరియు అత్యంత ప్రాముఖ్యాన్ని కలిగిన అవార్డు లను ఆయా విభాగాల్లో సత్తా చాటిన క్రికెట్ ఆటగాళ్లకు బహుకరిస్తుంది అనే విషయం మన అందరికీ తెలిసిన విషయమే. ఆ మూడు ప్రతిష్టాత్మకమైన అవార్డులు ఏంటంటే, మొదటిది బెస్ట్ టెస్ట్ ప్లేయర్ అఫ్ ది ఇయర్ కాగా, రెండవది వన్ డే ఇంటర్నేషనల్ (ODI) ప్లేయర్ అఫ్ ది ఇయర్, ఇంకా మూడవది, మన క్రికెట్ ఆటగాళ్లు అత్యంత గొప్పదిగా భావించే ఐసీసీ (ICC) క్రికెటర్ అఫ్ ది ఇయర్ అవార్డు.

ఇలా మూడు అవార్డు లను ఐసీసీ ప్రతీ ఏడాది ప్రకటించి క్రికెట్ ఆటగాళ్లనే గాకా క్రికెట్ ఔత్సాహికుల్లో కూడా రెట్టింపు ఉత్సాహాన్ని కలిగింప జేస్తోంది అని చెప్పుకోవాల్సిందే. తమ అభిమాన క్రికెటర్ కు ఈ మూడింటి లో ఏ అవార్డు లభిస్తుందో అనే ఉత్సుకత ప్రతీ ఒక్కరి మదిలో ఉంటుంది అనేది మనం ప్రత్యేకం గా చెప్పుకోనక్కరలేదు.

ప్రతీ ఒక్క దేశ క్రికెట్ జట్టు లో తన యొక్క అద్భుతమైన ఆట తీరుతో, ఆట శైలి తో ఎవరో ఒక క్రికెటర్ ఆ దేశ ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకుంటాడనే విషయం లో ఎటువంటి సందేహం లేదు. అయితే, మన దేశ క్రికెట్ జట్టు విషయానికి వస్తే పోయిన సారి జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ వరకు కూడా భారతీయులందరికి అతి ప్రియమైన ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని అని మనందరికీ తెలుసు.

కానీ గత మూడు, నాలుగు సంవత్సరాల వ్యవధి లో మన దేశ  క్రికెట్ లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి అనే చెప్పాలి. ఇలాంటి సమయం లో తన అద్భుతమైన ప్రదర్శనలతో అందరి మన్ననలు పొంది, ఎంతో మంది విమర్శకుల ప్రశంసలు అందుకుని, కోట్లాది మంది అభిమానులని సంపాదించుకుని ఒక బాణం లా దూసుకుపోతున్నాడు మన విరాట్ కోహ్లీ. భారత క్రికెట్ లో సముచిత స్థానాన్ని అందుకున్న విరాట్, ప్రపంచ క్రికెట్ లో కూడా తనకు ఎదురు లేదని మరోసారి నిరూపించి భారత జాతి కీర్తి ని నలుదిశలా చాటి చెప్పాడు.

ప్రస్తుత విషయానికి వస్తే, ప్రతీ సంవత్సరం ప్రకటించినట్లుగానే, ఈ సంవత్సరం యొక్క అవార్డు గ్రహీతలను ఈ వారం లోనే ప్రకటించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). ఈ సారి జరిగిన అత్యంత అరుదైన విశేషం ఏంటంటే, ఐసీసీ క్రికెటర్ అఫ్ ది ఇయర్, టెస్ట్ ప్లేయర్ అఫ్ ది ఇయర్, ఇంకా వన్ డే ఇంటర్నేషనల్ ప్లేయర్ అఫ్ ది ఇయర్ – మూడు అవార్డు లను విరాట్ కోహ్లీ ఒక్కడే సాధించి అందరినీ విస్మయుల్ని చేసాడు.

మూడు అవార్డులను కైవసం చేసుకున్న విరాట్ కోహ్లీ క్రికెట్ ఆటలో ఈ సంవత్సరానికి గాను జగజ్జేతగా నిలిచాడనే మనం భావించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరానికి గాను విరాట్ కోహ్లీ సృష్టించిన పరుగుల సునామి ని గనక మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆ విషయం సుస్పష్టం అవుతుంది. 2018 లో పదమూడు టెస్ట్ మ్యాచ్ లలో పాలుపంచుకున్న మన విరాట్ ఏకం గా 1322 పరుగులను (సగటు – 55.08) తన ఖాతా లో వేసుకున్నాడు అంటేనే అతని ఆట తీరు ఎంత అద్భుతమైనదో మనం అర్ధం చేసుకోవచ్చు.

ఇక విరాట్ కోహ్లీ ఆడిన వన్ డే ఇంటెర్నేషనల్స్ విషయానికి వస్తే, పద్నాలుగు మ్యాచ్ లకు నేతృత్వం వహించిన విరాట్ 1202 పరుగులను (సగటు – 133.55) సాధించడమే గాక, ఏకంగా ఆరు శతకాలను తన ఖాతా లో వేసుకుని తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు.

ఈ విషయమై ప్రపంచ వ్యాప్తం గా ఉన్న క్రికెట్ అభిమానుల యొక్క అభిమతం ఏంటో తెలుసుకుందాం అని ఐసీసీ అధికారులు ట్విట్టర్ లో “విరాట్ కోహ్లీ GOAT ఆ?” అని ఒక ప్రశ్నను సంధించారు. GOAT అంటే గొర్రె కాదండోయ్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అని దాని అర్ధం. అభిమానుల్లో ఒకరు “టెండూల్కర్ ఇంకా బ్రాడ్మన్ లను మాత్రమే మనం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం గా పిలుచుకుంటాం. కానీ విరాట్ తన ఈ చిన్న వయసులో ఇంత గొప్ప ప్రదర్శనలు చేయడం చాలా గొప్ప విషయం. ఈ విధం గానే రాణిస్తే విరాట్ ని కూడా GOAT గా మనం భావించొచ్చు,” అని స్పందించారు.

Be the first to comment on "విరాట్ కోహ్లీ GOAT ఆ? అని ట్విట్టర్ వినియోగదారులను అడిగిన ఐసీసీ"

Leave a comment

Your email address will not be published.


*