30 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై భారత్ విజయం

భారత్ పై మొదటిసారి టీ20 సిరీస్ గెలవాలని ఆశపడిన బంగ్లాదేశ్‌‌‌కి భంగపాటు తప్పలేదు. నాగ్‌పూర్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన సిరీస్ విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ 20 మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సత్తాచాటిన టీమిండియా 30 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ని చిత్తుగా ఓడించింది. భారత ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ 6/7తో టీ20 చరిత్రలోనే అత్యుత్తమ రికార్డుని నమోదు చేశాడు. దీంతో మూడు టీ20ల సిరీస్‌ని 2-1తో భారత్ చేజిక్కించుకోగా.. గురువారం నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభమవుతుంది.  మ్యాచ్‌లో మొదట శ్రేయాస్ అయ్యర్ (62: 33 బంతుల్లో 3×4, 5×6), కేఎల్ రాహుల్ (52: 35 బంతుల్లో 7×4) హాఫ్ సెంచరీలు కొట్టడంతో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఓపెనర్ మహ్మద్ నయిమ్ (81: 48 బంతుల్లో 10×4, 2×6) నిలకడగా ఆడటంతో బంగ్లాదేశ్ గట్టి పోటీనిచ్చేలా కనిపించింది. కానీ.. టీమ్‌లో అతనికి ఎవరూ సహకారం అందించలేకపోయారు. దీంతో.. ఆ జట్టు ఆఖరికి 19.2 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో దీపక్ చాహర్ కెరీర్ బెస్ట్ ప్రదర్శనని నమోదు చేయగా.. యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే (3/30) కీలక సమయంలో వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ని భారత్‌వైపు తిప్పాడు.

వాస్తవానికి ఛేదనని 12/2 తో పేలవంగా ప్రారంభించిన బంగ్లాదేశ్ తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. మహ్మద్ నయిమ్ అద్భుతంగా పోరాడాడు. కానీ.. సౌమ్య సర్కార్ (0), ముష్ఫికర్ రహీమ్ (0), ఆపిప్ హుస్సేన్ (0)లను గోల్డెన్ డక్ రూపంలో ఔట్ చేసేసిన టీమిండియా బంగ్లాదేశ్‌ని ఒత్తిడిలోకి నెట్టడంలో సఫలమైంది. మధ్యలో కెప్టెన్ మహ్మదుల్లా (8) కాస్త బ్యాట్ ఝళిపించే ప్రయత్నం చేసినా.. లాభం లేకపోయింది.  మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా భారత్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించాడు. దీంతో.. శిఖర్ ధావన్ (19: 16 బంతుల్లో 4×4)తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ (2: 6 బంతుల్లో) ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఔటైపోగా.. కొద్దిసేపు బ్యాట్ ఝళిపించిన ధావన్ కూడా జట్టు స్కోరు 35 వద్ద పెవిలియన్ చేరిపోయాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్‌ తో కలిసి కేఎల్ రాహుల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు.

Be the first to comment on "30 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై భారత్ విజయం"

Leave a comment